కలం వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case)లో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు(BRS MLC Naveen Rao)కు నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై విచారణ(Investigation)కు సహకరించాలని సిట్ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సీనియర్ అధికారులు, కీలక వ్యక్తులను సిట్ విచారించగా, తాజాగా ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. డివైజ్‌తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నవీన్ రావుపై ఆరోపణలున్నాయి. త్వరలో బీఆర్ఎస్‌కు చెందిన మరికొంతమంది నేతలనూ సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఇటీవల సిట్ విచారణ జరిపింది. మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రభాకర్ రావు ఫోన్ కాల్స్ గురించి సిట్ కీలక ప్రశ్నలు వేసింది. కానీ, హరీష్ రావు కేవలం నక్సలైట్ల బెదిరింపుల గురించే మాట్లాడినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తనను ఎస్ఐబీ చీఫ్‌గా ఎందుకు నియమించారని అడగగా ఈ ప్రశ్న కేసీఆర్‌నే అడగాలని సమాధానమిచ్చారు.


