epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సంతకం కోసమే వచ్చారా?

కలం డెస్క్ : ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ (KCR) సభకు వచ్చినా.. రాకున్నా.. బీఆర్ఎస్‌లో మాత్రమే కాక అన్ని పార్టీల్లోనూ అదో చర్చనీయాంశం. గతేడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున (గవర్నర్ ప్రసంగం) హాజరైన కేసీఆర్ తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజున (డిసెంబరు 29) హాజరయ్యారు. మళ్ళీ ఫామ్‌హౌజ్‌కు వెళ్ళిపోయారు. సాగునీటి అంశాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్.. అసెంబ్లీలో జరిగే చర్చకు గైర్హాజరుకావడం విమర్శలకు దారితీసింది. కేవలం రిజిస్టర్‌లో సంతకం చేయడానికి మాత్రమే వచ్చారా?.. అంటూ సెటైర్లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బాధ్యత ఇదేనా?.. అంటూ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల నుంచి విమర్శలు వచ్చాయి.

బాధ్యత… రాష్ట్ర ప్రయోజనాలు బేఖాతర్ :

తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుడిగా రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రెండేండ్లు మౌనంగా ఉన్నానని కేసీఆర్ (KCR) ఇటీవల గంభీర ప్రకటనలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో జరిగే ఇరిగేషన్ చర్చలో పాల్గొంటారని కొందరు భావించారు. తప్పకుండా పాల్గొనాలని సీఎం సహా మంత్రులు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన గైర్హాజరయ్యారు. తెలంగాణ భవిష్యత్తు నీటి అవసరాలపై జరిగే చర్చలో పాల్గొనకపోవడాన్ని వివిధ పార్టీల సభ్యులు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, జిల్లాల్లో బహిరంగసభలు పెట్టి ప్రజలకు అర్థం చేయిస్తామన్న కేసీఆర్ దాన్ని మాటలకే పరిమితం చేసి అసెంబ్లీ సెషన్‌కు డుమ్మా కొట్టారన్న కామెంట్లు ఓపెన్‌గానే వినిపిస్తున్నాయి.

జీతం తీసుకున్నప్పుడు పనిచేయరా?.. :

ప్రజాప్రతినిధులపై ఉద్యోగుల్లో, మధ్యతరగతి ప్రజల్లో, చదువుకున్న యువతలో రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ప్రజా సేవ చేస్తున్నామంటున్న రాజకీయ నాయకులకు జీతాలెందుకు అనేది వారి వాదన. ప్రతి నెలా ఎమ్మెల్యేల అధికారిక వేతనం రూ. 20 వేలు. కానీ నియోజకవర్గ అలవెన్సు కింద ప్రతి నెలా రూ. 2.30 లక్షల చొప్పున అందుకుంటుంటారు. కనీస స్థాయిలో ప్రతీ ఎమ్మెల్యే నెలకు రూ. 2.50 లక్షల చొప్పున జీతం తీసుకుంటున్నారు. ఇక ఉచిత విద్యుత్ లాంటి రాయితీలు వీటికి అదనం. ఇవి కాక అసెంబ్లీ సెషన్‌కు హాజరైనప్పుడు ఇచ్చే అలవెన్సులు అదనం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016 మార్చిలో ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచుతూ చట్ట సవరణ చేయడంతో అప్పటివరకూ అందుకుంటున్న వేతనాలు ఒక్కసారిగా 161% చొప్పున పెరిగాయి. అప్పట్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల వేతనాలే దేశంలోని అన్నా రాష్ట్రాల్లోకెల్లా ఎక్కువ.

శాలరీ కోసమే అటెండెన్స్ :

ఎమ్మెల్యేల జీతాల పెంపును ఆయన సమర్ధించుకున్నారు. “ఇది త్యాగాలు చేసే శకం కాదు… ఎందుకంటే ప్రజా ప్రతినిధులు జాతి నిర్మాణంలో భాగస్వాములు… ఇప్పుడు భారీ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు… స్వాతంత్ర్యకాలం నాటి పరిస్థితులు మారాయి.. వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది..” అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సభకు హాజరుకావడంలేదు. తరచూ ముఖ్యమంత్రి రేవంత్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. కేవలం జీతం, అలవెన్సులు, రాయితీలు, సౌకర్యాలు పొందడానికే నిర్దిష్ట గడువు ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు సభకు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజా సమావేశాల సందర్భంగా ఈ విమర్శ మరింత ఉధృతమైంది.

Read Also: బీఆర్ఎస్ చారిత్రక తప్పిదం.. పైచేయి సాధించిన కాంగ్రెస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>