కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదని, కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వను పరిశీలించారు. అనంతరం వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును పరిశీలించి మాట్లాడారు. పంట కాల్వల మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదన్నారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుందని, ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయకపోవడం వల్ల అధ్వాన్నంగా తయారైందన్నారు. 700 ఎకరాల్లోని రుద్రమదేవి చెరువుకు కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకపోవడం వల్ల గోదావరి నీళ్లు రావడంలేదని చెప్పారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని రెండు ఎన్నికల్లో మాట ఇచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని మాట ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఈ చెరువును పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎస్సారెస్పీ స్టేజ్ టూ లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేలా రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రని పరిశీలించి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Read Also: కలుషిత నీటి నివారణకు రొబోటిక్ టెక్నాలజీ
Follow Us On: Sharechat


