కలం వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో (Bangladesh) జరుగుతున్న అల్లర్లకు మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల అల్లరి మూకలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రగాయాలపాలైన హిందూ వ్యాపారి ఖోకన్ చంద్రదాస్ (Khokan Chandra Das) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ (Shariatpur) జిల్లాలో డిసెంబర్ 31న చంద్రదాస్‌పై పెట్రోల్ దాడి జరిగింది. గత రెండు వారాల్లో హిందూ మైనారిటీలపై నాలుగు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
చంద్రదాస్ షరియత్‌పూర్ జిల్లాలోని క్యూర్‌భంగా బజార్‌లో మెడికల్ షాప్ నడుపుతున్నాడు. గత బుధవారం సాయంత్రం షాపు మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా దుండగులు అతడి ఆటోను ఆపి దాడి చేశారు. చంద్రదాస్‌ను కత్తులతో పొడిచి, తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల ధాటికి చంద్రదాస్ పరుగెత్తుతూ సమీపంలోని చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ముందు షరియత్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో ఢాకాలోని నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రదాస్ శనివారం ఉదయం 7 గంటలకు మరణించాడు.
చంద్రదాస్ మృతితో అతడి కుటుంబం కన్నీటి పర్యంతమైంది. చంద్రదాస్ భార్య సీమా దాస్ మాట్లాడుతూ.. తన భర్త సాధారణ వ్యక్తి అని, తమ కుటుంబానికి ఎవరితోనూ గొడవలు లేవని చెప్పారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించినట్టు చెప్పారు. ఇది మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో భాగమా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత రెండు వారాల్లోనే ముగ్గురు హిందువులు అల్లరిమూకల దాడుల్లో మరణించారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరింత ఆందోళన నెలకొంది.

Read Also: అమెరికా అదుపులో వెనిజులా అధ్యక్షుడు : ట్రంప్
Follow Us On : WhatsApp


