కలం, ఖమ్మం బ్యూరో : మారుమూల గిరిజన ప్రాంతమైన చర్లలో మాతా శిశు వైద్య సేవలు విప్లవాత్మక మార్పులకు వేదికవుతున్నాయి. గతంలో నెలకు కేవలం 3 నుంచి 4 ప్రసవాలు మాత్రమే జరిగే చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో (Charla CHC) ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 50కి చేరడం ఆసుపత్రి సాధించిన ప్రగతికి అద్దం పడుతోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అత్యవసర సమయంలో గోల్డెన్ అవర్స్‌లో సురక్షితమైన ప్రసూతి సేవలు అందుతుండటంతో గిరిజన మహిళల్లో ధైర్యం, ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం గణనీయంగా పెరిగింది.
ఇటీవల 30 పడకల చర్ల ఆసుపత్రి (Charla CHC) భవన నిర్మాణ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు ద్వారా ఆసుపత్రి అందిస్తున్న విశిష్ట సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. గత సెప్టెంబర్‌లో చర్ల సీహెచ్‌సీలో మొత్తం 46 ప్రసవాలు నిర్వహించగా, అందులో 30 సాధారణ ప్రసవాలు, 16 సిజేరియన్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రీ-ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా, అబ్రప్షియో ప్లాసెంటా, గ్రాండ్ మల్టీపారా, అబ్‌స్ట్రాక్‌టెడ్ లేబర్ వంటి తీవ్ర ముప్పు ఉన్న 8 హైరిస్క్ ప్రసూతి కేసులకు నిపుణులు స్థానికంగానే విజయవంతంగా వైద్యం అందించారు.
చర్ల నుంచి భద్రాచలం దాదాపు 56 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో గతంలో అత్యవసర ప్రసూతి సమయాల్లో రవాణా ఆలస్యం కారణంగా ప్రాణాపాయం ఏర్పడేది. ప్రస్తుతం చర్లలోనే కాంప్రహెన్సివ్ ఎమర్జెన్సీ ప్రసూతి, సిజేరియన్ సేవలు అందుబాటులోకి రావడంతో గోల్డెన్ అవర్స్‌లోనే తల్లులు, శిశువులకు అవసరమైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడుతున్నారు. దీంతో భద్రాచలానికి వెళ్లే రిఫరల్స్ గణనీయంగా తగ్గాయి. గర్భిణుల కోసం కొత్తగా టీఐఎఫ్‌ఎఫ్‌ఏ స్కాన్, ఏఎన్‌సీ స్కానింగ్ సేవలు కూడా స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక గైనకాలజిస్ట్, ఒక అనస్థీషియాలజిస్ట్, రెగ్యులర్ పీడియాట్రిషియన్ నిరంతర సేవలు అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, నర్సింగ్ సిబ్బందిని సమకూర్చడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి సారించారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవి బాబు నిరంతర పర్యవేక్షణ, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి వర్ధన్ నేతృత్వంలో వైద్యులు, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమిష్టి కృషితో చర్ల ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.
Also Read : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!
Follow Us On: Youtube

