కలం, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైన్ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను సడలించింది. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినోపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు సమస్యలు నివేదిస్తామని, సహాయం చేయాలని కోరతామని తెలిపారు.
అన్ని సెక్టార్లలో విద్యుత్ వినియోగం ఆల్ టైం రికార్డుకు పెరిగిందని, నీటి సమస్య కూడా నెలకొందని వెల్లడించారు. 5,800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 2 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ కోసం కూడా టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. వీటితో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గట్టు ప్రాజెక్ట్, ఇందిరా సాగర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2 జీ బార్లలో అడిషనల్ ప్రివిలేజ్ ఫీజు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

