గతాన్ని తలచుకుని బాధపడొద్దు: కలెక్టర్ సత్య శారద

కలం, వరంగల్‌: వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా ప్రశాంతంగా వర్తమానాన్ని ఆనందంగా గడపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద (Collector Satya Sharada) సూచించారు. కుటుంబంలో, సమాజంలో ఓర్పుతో సర్దుబాటు చేసుకుంటూ తమ అనుభవాలను భావితరాలకు అందించాలని కోరారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌ కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల అనుభవాలు కీలకమన్నారు. ‘స్ఫూర్తి’ కార్యక్రమంలో విశ్రాంత విద్యావంతులు విద్యార్థులతో అనుభవాలు పంచుకోవడం అభినందనీయమని, దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని చెప్పారు. వయోవృద్ధులు తమ ఆస్తిపాస్తులను తమ వద్దే ఉంచుకోవాలని, అవసరమైతే వీలునామా రాసుకోవాలని సూచించారు.

ముందుగానే కొడుకులు, కూతుళ్లకు సేల్‌డీడ్‌, గిఫ్ట్‌డీడ్‌ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. సమస్యలు ఎదురైతే 14567 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు వయోవృద్ధులు తమ హక్కులు, సంక్షేమ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఆర్డీవో, కలెక్టర్‌, సంక్షేమ శాఖను సంప్రదించాలన్నారు.

ఇదిలా ఉండగా, గతంలో రైల్వే ప్రయాణాల్లో కల్పించిన 40 శాతం వయోవృద్ధుల రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ వయోవృద్ధుల కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని సీఎం, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టానికి సంబంధించిన గైడ్‌ పుస్తకాలను కలెక్టర్‌ ఆవిష్కరించి, పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసే అవగాహన డిస్‌ప్లే బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, వై.వి.గణేష్‌, ఆర్డీవో ఉమారాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, అధికారులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>