కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌లతో కలిసి మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
చంద్రపురి కాలనీలో యూఐడీఎఫ్ నిధులు రూ. 65.30 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, ప్రజలు మంగళహారతులు, గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ… ప్రతి డివిజన్లో మురుగు నీటి సమస్యలు, రవాణా ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే మరో రూ. 30 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తీసుకువచ్చి నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తీగలగుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ సిటీ నిధులు రూ. 1.05 కోట్లతో అభివృద్ధి చేసిన నూతన డైనింగ్ హాల్, స్టేజ్, తరగతి గదులను మంత్రి ప్రారంభించారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ రాజీలేని ధ్యేయమని బండి సంజయ్ పేర్కొన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ‘సంకల్ప అభియాన్ అంగన్వాడీ మిలన్ సేవా’లో పాల్గొని చిన్నారులకు పోషకాహారం పంపిణీ చేశారు. అనంతరం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా ‘ఆసరా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రక్తదాతలకు ‘ఆసరా ప్రాణదాతల’ జిల్లా స్థాయి అవార్డులను ప్రధానం చేసి, వారి సామాజిక సేవను కొనియాడారు. కేంద్ర సహకారంతో అంగన్వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : రవీంద్రభారతిలో జూపల్లిని అడ్డుకున్న కళాకారులు!
Follow Us On: Youtube

