కలం డెస్క్ : రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులతో పాటు కృష్ణా (Krishna), గోదావరి (Godavari) జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మంత్రి ఉత్తమ కుమార్ (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు రంగం సిద్ధమైంది. తొలుత 39 స్లైడ్‌లుగా పీపీటీ ప్రదర్శన ఇవ్వాలనుకున్నప్పటికీ చివరకు అది 74 స్లైడ్‌లకు పెరిగింది. ఇందులో దాదాపు 25 స్లైడ్‌లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, అపెక్స్ కౌన్సిల్‌లో జరిగిన నిర్ణయాలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయంటూ కుదుర్చుకున్న ఒప్పందం, కేంద్రం-రాష్ట్రం మధ్య జరిగిన కరస్పాండెన్స్.. ఇలాంటివి ఉంటాయి. మిగిలినవి రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, వాటి ఫలితం.. ఇలాంటివాటికి సంబంధించినవి ఉంటాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
పీపీటీలో రాష్ట్ర ఇరిగేషన్ ముఖచిత్రం :
మొత్తం 74 స్లైడ్‌లతో రాష్ట్ర సాగునీటి వనరుల ముఖచిత్రాన్ని మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం దాదాపు గంటన్నర సమయాన్ని వెచ్చించనున్నారు. ప్రతీ స్లైడ్‌కు కనీసంగా ఒక నిమిషం వివరణ ఇవ్వడానికి కేటాయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై కూలంకషంగా అధ్యయనం చేసిన ఆయన అధికారుల నుంచి తీసుకున్న తాజా వివరాలను, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అసెంబ్లీలో సభ్యులకు వివరించనున్నారు. ప్రజాభవన్‌లో ఈ నెల 1వ తేదీన ఎమ్మెల్యేలకు నిర్వహించిన సమావేశంలో సైతం ఒక పీపీటీని ప్రదర్శించి అవగాహన కలిగించారు. దీనికి మరికొన్ని అంశాలను చేర్చి సమగ్రంగా ఉండేలా 74 స్లైడ్‌లలో మొత్తం అర్థమయ్యేలా ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
స్పీకర్‌కు రెండు వైపులా డిజిటల్ స్క్రీన్‌లు :
మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలయ్యేలా షెడ్యూలు ఖరారైంది. ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగుల నియామకం, క్రమబద్ధీకరణకు సంబంధించిన రెండు బిల్లులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే రెండు బిల్లులను ఆ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత పన్నెండు గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ పీపీటీ మొదలయ్యేలా షెడ్యూలు రూపొందింది. స్పీకర్ స్థానికి రెండు వైపులా డిజిటల్ స్క్రీన్‌లు ఏర్పాటయ్యాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి వనరుల విషయంలో జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన నష్టాన్ని పోల్చుతూ నిర్దిష్టమైన గణాంకాలతో స్లైడ్‌లను మంత్రి ప్రదర్శించి వివరించనున్నారు.
BRS లేకుండానే సుదీర్ఘ చర్చ :
రాష్ట్రానికి జలాల అంశంలో జరిగిన అన్యాయాన్ని, గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని, కేసీఆర్ చేసిన ఒక్క సంతకం రాష్ట్ర సాగునీటి వనరులకు మరణశాసనంగా మారడం.. ఇలాంటి కామెంట్లతో మంత్రి ఉత్తమ్ సభ్యులకు వివరణ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ సభ్యులుండగానే తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు వ్యవహరించిన తీరు, నిర్లక్ష్యం, రాష్ట్రానికి చేసిన నష్టం, ద్రోహం.. ఇలాంటి వ్యాఖ్యలతో పీపీటీపై సభ్యులకు అవగాహన కలిగించనున్నారు. దాన్ని చక్కదిద్దడానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి మేలు కలిగేలా చేస్తున్న ప్రయత్నాలను సైతం వివరించనున్నారు. సమావేశాల్లో మాట్లాడడానికి స్పీకర్ అవకాశం ఇవ్వడంలేదనే కారణంతో బీఆర్ఎస్ ఈ సెషన్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయడం గమనార్హం.
తెలంగాణ భవన్‌లో పోటీ పీపీటీ :
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శించనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు పోటీగా హరీశ్‌రావు (Harish Rao) సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో పోటీ పీపీటీ రెడీ అవుతున్నది. తొలుత అనుకున్నట్లుగా శనివారం మధ్యాహ్నమే ఈ ప్రదర్శన షెడ్యూల్ అయింది. కానీ మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రదర్శిస్తుండడంతో అది పూర్తయిన తర్వాత సాయంత్రానికి ఇవ్వడమా?.. లేక ఆదివారం ప్రదర్శించడమా?.. అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి ఉత్తమ్ లేవనెత్తే అంశాలకు కౌంటర్ ఇచ్చేలా మరికొన్నింటిని చేర్చడంపై ఆధారపడి హరీశ్‌రావు పీపీటీ శనివారమే ఉంటుందా?.. లేక ఆదివారం ఉంటుందా?.. అనేది డిసైడ్ కానున్నది. దాదాపు 100కు పైగా స్లైడ్స్ ఉండొచ్చని ఆ పార్టీ నేతల సమాచారం.
Read Also: కేంద్ర జలశక్తి కమిటీతో తెలంగాణకు నష్టమే : హరీష్ రావు
Follow Us On: X(Twitter)


