సరిహద్దుల్లో సైలెంట్ దందా.. నిజామాబాద్‌లో అక్రమ మైనింగ్!

కలం, నిజామాబాద్ బ్యూరో: మైనింగ్ దందా సరిహద్దు దాటుతోంది. అడవులను ఆక్రమించి అడ్డగోలుగా తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిజామబాద్ జిల్లాలో గ్రానైట్ క్వారీల నిర్వాహకులు రూ.కోట్లలో అక్రమాలకు (Nizamabad Mining) పాల్పడుతున్నట్టు విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. జిల్లాలో 190 కోట్ల రాయల్టీ ఎగవేసినట్లు తేలింది. పలు క్వారీలు రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ ను తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రహరీలు, చెక్ పోస్టులు ఏర్పాటు

జిల్లాలోని కమ్మర్ పల్లి, భీమ్ గల్, మెండోరా మండలాల సరిహద్దుల్లో 33 హెక్టార్లలో 11 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. 2013 నుంచి రెండు, మిగతావన్నీ 2022 నుంచి ప్రారంభమయ్యాయి. చుట్టూ ప్రహరీలు, చెక్ పోస్టులను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి కంటపడకుండా పక్కనున్న అటవీ భూముల్లోనూ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అటు అటవీ శాఖ అధికారులు కూడా భూములను పరిశీలించిన దాఖలాల్లేవు. క్వారీల పక్కన గిరిజనుల సాగు భూములే ఎక్కువగా ఉన్నాయి. నిర్వాహకులు గ్రామ పెద్దలను తాయిళాలతో మచ్చిక చేసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత గనుల శాఖ అనుమతుల్లేకుండానే తవ్వకాలు చేపడుతున్నారు.

అంచనా.. చెల్లింపుల్లో తేడాలు

క్వారీని లీజుకు తీసుకునే కంపెనీలు, కాంట్రాక్టర్లు ముందుగా గనుల శాఖకు అంచనాలను సమర్పిస్తారు. తవ్వకాలు చేపట్టి తీసే రాళ్లలో 25 శాతం నాణ్యమైనవి ఉంటాయని, దీని ప్రకారం రాయల్టీ చెల్లిస్తామంటూ ముందస్తుగా సంబంధిత పత్రాలు అందజేస్తారు. తీరా తవ్వకాలు చేపట్టి లాభాలు గడించాక, తమకు పది శాతం నాణ్యమైన గ్రానైట్ రాయి మాత్రమే లభించిందంటూ పన్ను ఎగవేస్తున్నారు. మొత్తం 11 క్వారీలకు 33 హెక్టార్లు కేటాయించగా, అంతకు రెట్టింపు భూమిలో తవ్వకాలు జరిపారు. వీటిల్లో రెండు నెలల కిందట విజిలెన్స్ బృందం తనిఖీలు చేసింది. తవ్వకాలు, తరలించిన గ్రానైట్, వారు ముందస్తుగా ఇచ్చిన అంచనాలన్నింటినీ లోతుగా పరిశీలించింది. దీన్ని బట్టి రూ. 190 కోట్ల రాయల్టీని తక్కువగా చెల్లించారని నివేదికలో వెల్లడైంది.

దుమ్ము, ధూళి.. రోడ్లు ధ్వంసం

క్వారీ పేలుళ్ల కారణంగా పరిసరాల్లోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. దుమ్ము, ధూళితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. రాళ్లను తరలించే లారీల కారణంగా రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. విధ్వంసం ఒక ఎత్తయితే.. రూ. కోట్లల్లో రాయల్టీ ఎగ వేయడం మరొక ఎత్తు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు ఏం చేశారు? తనిఖీలు ఎందుకు అటకెక్కించారు? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎగవేసిన పన్నును రాబడతారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>