కలం, వెబ్ డెస్క్: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ, దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మనుస్మృతిని ప్రోత్సహించే భావనలో బీజేపీ..
దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, అస్పృశ్యత నిర్మూలన వంటి విలువలను అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా తొలి తీర్మానం ఆమోదించబడిందని, అనంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతి, మను ధర్మశాస్త్ర భావజాలాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలోనే పలు చట్టాలు..
దేశంలోని ప్రతి పౌరుడినీ ఒక్కటిగా నిలబెట్టేది భారత రాజ్యాంగమేనని భట్టి విక్రమార్క తెలిపారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే దేశ పునాదులనే దెబ్బతీయడమేనన్నారు. దళితులు, ఆదివాసీలపై వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే పలు చట్టాలు తీసుకువచ్చామని చెప్పారు. ఖర్గే కేవలం దళిత నాయకుడు మాత్రమే కాదని, సుదీర్ఘ రాజకీయ పోరాటంతో దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించిన నాయకుడని కొనియాడారు. కర్ణాటకలో మంత్రిగా, సీఎల్పీ నేతగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తుచేశారు.

