రాష్ట్రానికే ఆదర్శంగా మధిర బ్రేక్‌ఫాస్ట్ మోడల్

కలం, ఖమ్మం బ్యూరో :  ఉదయాన్నే ఆకలి కేకలతో తరగతి గదుల్లో కూర్చునే రోజులకు కాలం చెల్లింది. వేడివేడి, రుచికరమైన పోషకాహారం విద్యార్థుల కడుపు నింపడమే కాకుండా, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో (Madhira) ఏర్పాటు చేసిన ‘సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్’ విజయవంతంగా రెండు నెలలు పూర్తి చేసుకుని, రాష్ట్రానికే ఒక తిరుగులేని నమూనాగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ బృహత్తర యజ్ఞం క్షేత్రస్థాయిలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది పిల్లలు ఉదయాన్నే టిఫిన్ తినకుండానే బడికి వచ్చేవారు. ఖాళీ కడుపుతో పాఠాలు వినడం వల్ల వారిలో ఏకాగ్రత లోపించి, చదువులో వెనుకబడిపోవడమే కాకుండా హాజరు శాతం కూడా తగ్గేది. ఈ పరిస్థితిని మధిరలోని కేంద్రీకృత వంటశాల పూర్తిగా మార్చేసింది. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా మధిరతో పాటు సమీపంలోని 11 మండలాల్లో ఉన్న 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 27,700 మంది విద్యార్థులకు నిత్యం శుభ్రమైన, రుచికరమైన అల్పాహారం అందుతోంది.

ఈ పథకం కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే లక్ష్యంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) నేతృత్వంలో ఒక సమతుల్య ఆహార పట్టికను రూపొందించారు. వారంలో ప్రతిరోజూ వైవిధ్యంగా ఇడ్లీ-సాంబార్, పూరి-ఆలూ కుర్మా, దోశ-చట్నీ, ఉప్మా-చట్నీలతో పాటు సంపూర్ణ పోషకాలందించే మిల్లెట్ ఇడ్లీ, బోండాలను అందిస్తున్నారు. వీటితో పాటు పిల్లలలో రక్తహీనతను నివారించేందుకు రోజు విడిచి రోజు వేడి పాలను కూడా అందిస్తూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

అంతర్జాతీయ పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ వండిన ఆహారాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వాహనాల ద్వారా బడులు ప్రారంభమయ్యే సమయానికే అన్ని పాఠశాలలకు వేడి తగ్గకుండా చేరవేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.11.50, ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ.13.50తో పాటు పాల కోసం అదనంగా రూ.1.08 చొప్పున కేటాయిస్తోంది. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఈ కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సహకారం ఈ ప్రాజెక్టు విజయానికి మరింత బలాన్నిచ్చింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 27,700 మంది పేద విద్యార్థుల జీవితాల్లో ఆరోగ్యకరమైన వెలుగులు నింపి, వారిని చదువుల వైపు పరుగెత్తిస్తున్న మధిర సెంట్రలైజ్డ్ కిచెన్ నేడు తెలంగాణ విద్యా వ్యవస్థకే ఒక దిక్సూచిగా మారింది. భావి పౌరులను బలీయమైన శక్తులుగా తీర్చిదిద్దడంలో ఈ ‘మధిర మోడల్’ న భూతో న భవిష్యతి అన్నట్లుగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>