కలం, ఖమ్మం బ్యూరో : నీటిలో ఈత కొట్టాల్సిన రొయ్య పిల్లలు కాంక్రీట్ గోడలపై ప్రాకుతూ ‘క్యాట్ వాక్’(Prawns Catwalk) చేస్తున్న అరుదైన దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని తుమ్మల చెరువులో మత్స్యకారులు ఇటీవల భారీ సంఖ్యలో రొయ్య పిల్లలను విడుదల చేశారు. అయితే, అవి నీటికే పరిమితం కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచేలా విచిత్ర ప్రవర్తనను ప్రదర్శిస్తున్నాయి.
చెరువులోకి వదిలిన రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురీదుతూ ఏకంగా కిలోమీటరున్నర దూరం ప్రయాణించాయి. ఈ క్రమంలో గొందిగూడెంలోని మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ వద్దకు చేరుకున్నాయి. అక్కడ ప్రవాహ ఉధృతిని తట్టుకుంటూ కాంక్రీట్ గోడలను అంటిపెట్టుకుని వందల సంఖ్యలో పైకి ప్రాకడం ప్రారంభించాయి. గోడలపై వరుసగా ప్రాకుతున్న రొయ్య పిల్లల దృశ్యాలను చూసేందుకు స్థానికులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. సాధారణంగా నీటి అడుగున ఉండే రొయ్యలు ఇలా ప్రవాహానికి ఎదురీదుతూ గోడలు ఎక్కడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ‘రొయ్యల క్యాట్ వాక్’ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి.

