కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామంలో ప్రజాప్రయోజనాల కోసం ఉమ్మడి వినియోగ విమానాశ్రయం (Adilabad Airport), ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి 878.13 గుంటల భూమి సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. భూసేకరణకు సంబంధించి అనుకుంట గ్రామంలో త్వరలో గ్రామసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామసభకు వారం రోజుల ముందుగా నోటీసు జారీ చేస్తామని తెలిపారు.
ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూ యజమానులు తమ పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ లేదా భూసేకరణ అధికారికి రాతపూర్వకంగా సమర్పించవచ్చని సూచించారు. విమానాశ్రయ ప్రాజెక్టు కోసం గతంలో టాక్లి, కచ్కంఠి, ఆర్లి (బి), నిషాన్‌ఘాట్ గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటికే సేకరించిన భూమికి అదనంగా మరో 2,009.32 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

