మంత్రి ప్రారంభించిన ఇంటికే ‘బిల్లు’ గ్రహణం!

కలం, ​జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంలో క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, వేధింపులు జగిత్యాల జిల్లా బుగ్గారం (Buggaram Indiramma House) మండల కేంద్రంలో వెలుగుచూశాయి. సాక్షాత్తు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఇంటికే తుది బిల్లు రాకపోవడం, అధికారుల చుట్టూ తిరగలేక లబ్ధిదారుడు ఆవేదన చెందడం స్థానికంగా తీవ్ర కలకలం  రేపుతోంది.

​వివరాల్లోకి వెళ్తే.. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఎండి రఫిక్ అనే లబ్ధిదారుడికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అప్పుసొప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న రఫిక్, ఇటీవల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఇంటిని ఘనంగా ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సాగౌడ్ మరియు పంచాయతీ పాలకవర్గం కూడా పాల్గొన్నారు.

కార్యదర్శి, ఏఈ ​వేధింపులు!

ఇంటి ప్రారంభోత్సవం పూర్తయినా రావాల్సిన తుది బిల్లు (ఫైనల్ బిల్లు) పొందడంలో బుగ్గారం పంచాయతీ కార్యదర్శి అక్బర్, హౌసింగ్ ఏఈలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారుడు రఫిక్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంట్లో నల్లాలు ఫిట్ చేయలేదని, ఇప్పుడు బిల్లు పంపినా రాదని పంచాయతీ కార్యదర్శి అంటున్నాడు. నల్లాలు ఫిట్ చేస్తాను, ఆ తర్వాత ఫోటో తీసి బిల్లు పంపించండి అని వేడుకున్నా వినడం లేదు” అని రఫిక్ ఆవేదన వ్యక్తం చేశారు.​ అంతేకాకుండా “నువ్వు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు చెప్పుకున్నా నాకేమీ కాదు… నీకు ఫైనల్ బిల్లు రావడం కష్టమే” అని పంచాయతీ కార్యదర్శి బాహాటంగానే బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఇక ఈ విషయమై హౌసింగ్ ఏఈకి ఫోన్ చేస్తే… “నాకెందుకు ఫోన్ చేశావ్? నా నంబర్ నీకెవరిచ్చారు?” అంటూ దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని రఫిక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వెంటనే రావాల్సిన ఫైనల్ బిల్లు ఇప్పించి న్యాయం చేయాలని రఫిక్ విజ్ఞప్తి చేశారు. తనను బెదిరింపులకు గురిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి అక్బర్, హౌసింగ్ ఏఈలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>