కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గద్వాల మున్సిపాలిటీ (Gadwal Municipality) కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ షాపుల అద్దెలు వసూలు చేయగా వచ్చిన రూ.11.28 లక్షలను మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడాన్ని కలెక్టర్ తీవ్ర తప్పిదంగా పరిగణించారు. ఈ వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్, ఇన్ఛార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్, ఇన్ఛార్జి షరాఫ్ రాజవర్ధన్ నాయుడును సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. సంబంధిత రసీదు పుస్తకాలు, రికార్డులు, రిమిటెన్స్ వివరాలను పరిశీలించాలని ఆదేశించారు.

