కలం, ఖమ్మం బ్యూరో: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థిని ఇంద్రవల్లి హరణి (18) కేసులో(Harini Death Case) దాగిన నిజాలను వెంటనే వెలికితీయాలని.. హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కోడెమ్ సీతాకుమారి డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వీడి ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరపాలని ఆమె కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు (Julurupadu) మండలంలో ఇటీవల మృతి చెందిన హరణి నివాసానికి మంగళవారం అసోసియేషన్ బృందం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించింది. ముందుగా హరణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అసోసియేషన్ తరఫున పూర్తి అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కోడెమ్ సీతాకుమారి మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరణి మృతి చెంది ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. పోలీసుల విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఘటనకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరణి మృతి వెనుక ఎంతటివారున్నా వదిలేది లేదని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మానవ హక్కుల సంఘం పోరాడుతుందని కోడెమ్ సీతాకుమారి స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ సెక్రెటరీ కుదురుపాక నిర్మల, నాయకులు ఆనగంటి లక్ష్మి, సూరమ్మ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

