కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ అలర్ల కేసులో భారత్ నిష్పాక్షిత దర్యాప్తు జరపాలని, ప్రధాన నిందితుడు ఉమర్ ఖలీద్ (Umar Khalid) కు బెయిల్ ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు లేఖ రాయడం వెనక రాహుల్ గాంధీ ప్రమేయమున్నట్లు బీజేపీ ఆరోపించింది. భారత్‌కు వ్యతిరేకంగా విదేశాల్లో ఏ కుట్ర జరిగినా దాని వెనక కచ్చితంగా రాహుల్ ఉంటారని మండిపడింది. ఈ మేరకు బీజేపీ నాయకుడు ప్రదీప్ భండారీ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా 2020లో ఢిల్లీలో అలర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు.
ఈ కేసులో ఉమర్ ఖలీద్‌తోపాటు షర్జీల్ ఇమామ్, హైదర్, ఖలీద్ షైఫీ తదితరులను ఉపా చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణలో జాప్యం చేయవద్దని, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, ఉమర్ ఖలీద్‌కు బెయిల్ ఇచ్చే అంశం పరిశీలించాలని అమెరికాకు చెందిన ఎనిమిది మంది చట్టసభ్యులు లేఖ రాశారు. దీనిని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ ఖ్వత్రాకు అందజేశారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లేఖ వెనక రాహుల్ (Rahul Gandhi) ఉన్నారంటూ.. నిరుడు రాహుల్ అమెరికాలో పర్యటించిన ఒక ఫొటోను విడుదల చేసింది. అందులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాతోపాటు ఉమర్ ఖలీద్ (Umar Khalid) విషయంలో లేఖ రాసిన అమెరికన్ చట్ట సభ్యులు జాన్ షొకోవ్స్కీ, రషీద్ తాలిబ్, ప్రమీలా జయపాల్ తదితరులు ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన బీజేపీ నేత ప్రదీప్ భండారీ.. రాహుల్ ప్రమేయాన్ని ప్రశ్నించారు.
ఇస్లామోఫోబియాను వ్యతిరేకిస్తూ రూపొందించిన ‘కంబాటింగ్ ఇంటర్నేషనల్ ఇస్లామోఫిబియా యాక్ట్’కు కారణమైన షొకోవ్స్కీ.. ఉమర్ ఖలీద్ విడుదలపై లేఖ రాయడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కాగా, మరోవైపు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ సైతం ఉమర్ ఖలీద్‌కు మద్దతుగా నోట్ రాయడంపై బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గౌరవ్ భాటియా స్పందించారు. భారత్ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
Read Also: ఆయుధాలు లోడ్ చేసి పెట్టాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Follow Us On: Pinterest


