రెసిడెన్షియల్ విద్యాసంస్థలపై నిరంతర పర్యవేక్షణ: సీఎస్

కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రతి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎస్ సంజయ్ జాజు (CS Sanjay Jaju) ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టర్ భవేశ్ మిశ్రా కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, మెరుగైన విద్యాబోధనతో పాటు మౌలిక వసతులపైనా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, సౌకర్యాలు పరిశీలించాలని సూచించారు.

ఫుడ్ పాయిజనింగ్‌పై మరింత అలర్ట్..

ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఫుడ్ పాయిజనింగ్, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ సంజయ్ జాజు ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు తదితర అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సాధ్యమైన చోట్ల వంటశాలల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.

దసరా లోగా యూనిఫారాలు..

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని డ్యాష్‌బోర్డ్‌ను ప్రతి కలెక్టర్ పరిశీలించాలని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా.. లేదా.. ఏవైనా లోపాలు ఉన్నాయా అనేది పరిశీలించి, ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులు, సమస్యల పరిష్కార చర్యలను కూడా పోర్టల్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు.

ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని సీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోజూ లక్ష యూనిఫారాలు కుట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా కలుషిత ఆహారం, పాముకాటు వంటి ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>