కలం, ఖమ్మం బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సంక్షేమంలోనూ తమవంతు బాధ్యత నెరవేరుస్తున్నామని నిరూపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీసులు(Karakagudem Police). ఓవైపు గ్రామంలో నేరాలు అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేపడుతూనే, మరోవైపు పేద చిన్నారులకు దుస్తులు పంపిణీ చేసి తమ మానవీయ కోణాన్ని చాటుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, కరకగూడెం పోలీసుల (Karakagudem Police) ఆధ్వర్యంలో సోమవారం కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా గ్రామంలోని ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు నేరాలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అశ్వాపురంపాడు గ్రామంలో మూడు నేర ఘటనలు చోటుచేసుకున్న దృష్ట్యా, నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామంలో నేరాలు పునరావృతం కాకుండా ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తనిఖీల అనంతరం గ్రామంలోని చిన్నారులకు పోలీసులు స్వయంగా దుస్తులను పంపిణీ చేశారు. పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకమై వారి సంక్షేమానికి కూడా నిరంతరం కృషి చేస్తుందని డీఎస్పీ తెలిపారు. గ్రామస్థులు ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పి.వి.ఎన్. రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : గుజరాత్‌లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!
Follow Us On: X(Twitter)

