కలం, వెబ్డెస్క్: స్వచ్ఛభారత్ (Swachh Bharat) కార్యక్రమంలో భాగంగా దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న ‘స్వచ్ఛ సర్వేక్షణ్ క్లీనెస్ట్ సిటీ’ (Swachh Survekshan) అవార్డుల్లో ఆ నగరం వరుసగా ఎనిమిదో సారి నెం.1 స్థానంలో నిలిచింది. అసలు ఈ అవార్డు మొదలుపెట్టినప్పటి నుంచి ఆ సిటీదే టాప్ ప్లేస్. కానీ, తాగునీటి కలుషితం (Water Contamination) కారణంగా గత వారంలోపే ఆ నగరంలో ఏకంగా పది మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore)లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల దాడికి కారణమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంపై ఏకంగా ప్రధాని మోదీ మీద విమర్శలకు దిగారు. కేంద్రం, మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజిన్ సర్కార్ స్వచ్ఛ పాలన పేరుతో ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనమన్నారు. బాధితులు, చనిపోయినవాళ్లు పేదలైతే ప్రధాని మోదీ నోరు పెగలదని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అసమర్థ పాలన వల్ల ఆ రాష్ట్రంలో ఇలాంటి తరచూ ఇటాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల మరణానికి కారణమైన దగ్గు మందు సంఘటన, ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య లోపం వంటివన్నీ ఆ రాష్ట్రంలోనే జరగడాన్ని గుర్తు చేశారు.
మరుగుదొడ్డి నీరు కలవడంతోనే..:
కాగా, ఇండోర్ (Indore) లోని తాగునీటి కలుషితానికి కారణాలను దాదాపు వారం రోజుల తర్వాత అధికారులు గుర్తించారు. ఆ నగర మున్సిపల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిటీలోని భగీరథ్పూర్లో మంచి నీటి పైప్లైన్లో లీకేజీని గుర్తించారు. మరుగుదొడ్డి నుంచి ఆ పైప్లైన్ వెళుతోంది. అదే నీటి కాలుష్యానికి (Contaminated Water) కారణమైన డయేరియా, తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు చెప్పారు. కలుషిత నీటి కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు ల్యాబ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. కలుషిత నీటిని తాగి ఇప్పటివరకు పది మంది మరణించగా, దాదాపు 11వందల మందిపైగా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
Read Also: జేఎన్‌టీయూ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్!
Follow Us On: Pinterest


