కలం డెస్క్ : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలన్న బీఆర్ఎస్ నిర్ణయం వ్యూహాత్మకమా?.. లేక పారిపోవడమా?.. ఇదీ ఇప్పుడు లాబీల్లో జరుగుతున్న చర్చ. సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ప్రభుత్వాన్ని కడిగేస్తాం.. ఉతికి ఆరేస్తాం.. అని గంభీర ప్రకటనలు చేసింది. చివరకు చర్చలో పాల్గొనకుండా బాయ్‌కాట్ (BRS Boycott) చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇది చర్చలో పాల్గొనకుండా పారిపోవడం మినహా ఇంకోటి కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ నీటి హక్కులకు శాశ్వతంగా నష్టం జరిగిందని, కేసీఆర్ చేసిన సంతకం మరణశాసనంలా మారిందని, వీటిని ఆధారాలతో సహా సభలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టంగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేసీఆర్ బాటలోనే బీఆర్ఎస్ లీడర్లు :
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ (KCR) తరహాలోనే బీఆర్ఎస్ లీడర్లంతా వ్యవహరిస్తున్నారనేది తాజా నిర్ణయంతో స్పష్టమైంది. అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ హాజరు కావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. ఆయన హాజరు కాకపోగా బీఆర్ఎస్ శాసనసభా పక్షం మొత్తం బహిష్కరించడాన్ని రాజకీయ తప్పిదమనే టాక్ అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నది. కేసీఆర్ ఆబ్సెంట్ అయ్యి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైతే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్‌గా హరీశ్‌రావు సెషన్ మొతాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ బాయ్‌కాట్ (BRS Boycott) అస్త్రాన్ని ప్రయోగించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ తరహాలోనే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీ మరింత డ్యామేజ్ కావడానికి దారితీస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి.
ప్రశ్నించడానికి బదులు పారిపోవడమా? :
అధికార, ప్రతిపక్షాలను సమాన దృష్టితో చూడాల్సిన స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు గన్ పార్కు దగ్గర నిరసనలో వ్యాఖ్యానించారు. స్పీకర్ వైఖరి కారణంగానే తాము అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో ఉండి కొట్లాడడానికి బదులు బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకే నెగెటివ్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో సభలో ఉండి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారని, స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకుపోయారని, ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు దానికి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవడం వెనక వారికి స్పష్టమైన ఉద్దేశాలు ఉండి ఉండొచ్నన్నది కొందరి అభిప్రాయం. కేసీఆర్ సభకు హాజరైతే ఆయన దోషిగా నిలబడాల్సి వస్తుందని, సభలో ఉంటే హరీశ్‌రావు సైతం అదే ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే డిఫెన్సులో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది పలువురు ఎమ్మెల్యేల రీడింగ్.
సభకు హాజరైతేనే పార్టీకి బతుకు : కవిత
కేసీఆర్ సభకు హాజరై సాగునీటి ప్రాజెక్టులపైనా, నీటి హక్కుల్లో జరిగిన అన్యాయంపైనా హాజరు కావడం మంచిదని, లేకపోతే బీఆర్ఎస్‌కు బతుకు ఉండదని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత (KCR) వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్‌రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు అప్పజెప్పడం పార్టీకి నష్టమని వ్యాఖ్యానించారు. ఆయనను అందరూ ట్రబుల్ షూటర్‌గా చెప్పుకుంటున్నా నిజానికి ఆయన బబుల్ షూటర్ అని విమర్శించారు. కేసీఆర్ సభకు హాజరై వివరించడం ద్వారా మాత్రమే ప్రజలకు విషయాలు అర్థమవుతాయని, హరీశ్‌రావుతో ప్రయోజనమేమీ లేదన్నారు. సభకు హాజరుకావాలంటూ కవిత సూటిగా చెప్తున్న పరిస్థితుల్లో హరీశ్‌రావు బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా వాస్తవాలు చెప్పాలి :
తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మీడియా సమావేశాలు, బహిరంగసభల ద్వారా ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదని, చట్టసభల్లో ఆధారాలతో సహా వివరించడం ద్వారానే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చన్నది అన్ని పార్టీల ఎమ్మెల్యేల భావన. అసెంబ్లీ సెషన్‌లో ప్రత్యేకంగా సాగునీటి అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో అందులో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను ఎక్స్ పోజ్ చేయడం ద్వారానే ప్రజల్లోకి వాస్తవాలు వెళ్తాయని, తొమ్మిదిన్నరేండ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ హాజరై ఖుల్లం ఖుల్లాగా విషయాలను వివరిస్తేనే బీఆర్ఎస్‌కు కలిసొస్తుందని, ఆయన హాజరు కాకపోగా పార్టీ శాసనసభా పక్షం మొత్తం ఈ సెషన్‌ను బాయ్‌కాట్ చేయడం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమేననే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ కాదని, పారిపోవడమేనన్నది వారి అభిప్రాయం.
Read Also: ‘పాలమూరు’ అవకతవకలపై ‘సిట్’ కాంగ్రెస్ నేతలు, కవిత డిమాండ్
Follow Us On : WhatsApp


