కలం, ఆదిలాబాద్: జిల్లాలో వివిధ దశల్లో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, సర్పంచులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మధ్యలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవనాల పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు ప్రారంభం కాని భవనాల మంజూరులను రద్దు చేసి, ఉపాధి హామీ పథకం, బీవీజీ రామ్జీ లేదా ఇతర ప్రత్యామ్నాయ నిధుల ద్వారా కొత్తగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో మంజూరై మధ్యలో నిలిచిపోయిన పనులను పరిశీలించి, అవసరమైన చోట మంజూరులను రద్దు చేసి ప్రత్యామ్నాయ నిధులతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో నిలిచిపోయిన జీపీ భవనాలను మరమ్మతుల కింద చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ రాథోడ్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈలు శివరాం, తనాజీ, ఇంజినీరింగ్ అధికారులు, వివిధ మండలాల సర్పంచులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

