కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో “కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం మొదటి మహాసభ” (Sheep Breeders Meeting) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రివాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ మహాసభలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు సరిత, తిరుపతి యాదవ్, చరణ్ కౌశిక్, బుర్ర జ్ఞానేశ్వర్, కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ బాస వేణి మల్లేశం యాదవ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కురుమ-యాదవ సామాజిక వర్గం ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి లబ్ధిని హక్కుగా కొట్లాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో తొక్కిసలాటకు గురికాకుండా ఉండాలంటే మనలో మార్పు రావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
భవిష్యత్తును మార్చేది చదువే..
గతంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన పరిస్థితులను, కన్నడ బెల్ట్ సరిహద్దు ప్రాంతాల్లో గొర్రెల కాపరులు పడే కష్టాలను గుర్తుచేసుకున్నారు. “నన్ను కొట్టండి కానీ నా గొర్రెను కొట్టకండి” అని గొర్రెలపై చూపించే ప్రేమను, పిల్లల భవిష్యత్తు, చదువుపై చూపించాలని కోరారు. కులవృత్తులతో పాటు భవిష్యత్తును మార్చే విద్య అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. రోజువారీ టీ ఖర్చు కంటే తక్కువ వ్యయంతో గొర్రెలకు ఇన్సూరెన్స్ చేయించి, నష్టపరిహారాన్ని హక్కుగా పొందేలా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానిక మార్కెట్ అవసరాలు
ప్రతి శనివారం హైదరాబాద్‌కి ఇతర రాష్ట్రాల నుంచి వందలాది డీసీఎమ్‌లలో గొర్రెలు వస్తున్నాయని, ఆ అవసరాలను మన రాష్ట్రంలోనే తీర్చేలా మన గొర్రెల కాపరులు ఎదగాలని సూచించారు.
రూ. 34 కోట్ల అప్పుల పరిష్కారానికి హామీ
గొర్రెల కాపరులకు సంబంధించి రూ. 34 కోట్ల అప్పుల అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామాజిక వర్గం కేవలం ఆర్థికంగానే కాకుండా అధికారంలోకి కూడా రావాలని, ఇందుకు నిదర్శనంగా తమ నియోజకవర్గంలో జనరల్ సీటు ఉన్నప్పటికీ కురుమ-యాదవ సోదరిని మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిపించుకున్నామని ఉదాహరించారు.
కులవృత్తులకు ప్రభుత్వం అండ: మంత్రి పొన్నం ప్రభాకర్
కులవృత్తులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. గొర్రెల పెంపకందారులతో తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని, వారి సమస్యలపై అవగాహన ఉందన్నారు.
50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా కృషి
గొర్రెల కాపరులు, ముదిరాజులు, గీత కార్మికులు, యాదవులు, నాయీ బ్రాహ్మణులు తదితర కులవృత్తిదారులందరికీ 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. రైతులకు పంట బీమా ఎంత ముఖ్యమో పశుపోషకులకు పశువుల బీమా కూడా అంతే ముఖ్యమని, అలాగే ఇందిరమ్మ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గొర్రెల పెంపకందారులకు హోల్‌సేల్ మార్కెట్లు, నిల్వ , విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన ధర లభించేలా చూడాలన్నారు. రియల్ ఎస్టేట్ వల్ల మేత స్థలాలు తగ్గుతున్నందున, గతంలో ఇచ్చిన జీవో 559, జీవో 543 తరహాలోనే గొర్రెల పెంపకానికి ప్రభుత్వ భూములను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంపద ఉన్నప్పటికీ మారుతున్న పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే పిల్లలను బాగా చదివించాలని, విద్య ఒక్కటే మన భవిష్యత్ తరాలకు బలమైన పునాది అని సూచించారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలను సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని,కులవృత్తులను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.

