కలం, వెబ్ డెస్క్ : జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రజా ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, గత ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను కూడా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే దసరా పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పాలకులు కేవలం కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాలకే పరిమితమై ఇళ్లను కేటాయించారని, కానీ తమ ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా సమన్యాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు తమ పరిపాలనకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Also Read : ఖైరతాబాద్ బై పోల్ పోటీపై కవిత కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

