రంగనాయకుడి గుడిలో భద్రత డొల్ల.. వరుస చోరీలతో ఆందోళన!

కలం, వనపర్తి: శ్రీరంగాపురం మండలంలోని ప్రసిద్ధ శ్రీరంగనాయక స్వామి (Sri Ranganayaka Swamy Temple) గుడికి దొంగల బెడద తప్పడం లేదు. గుడిలో వరుసగా చోరీలు జరుగుతున్నా భద్రతా ఏర్పాట్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం గుడి తలుపులు తీసే సమయానికి కొన్ని తాళాలు, తలుపులు తెరిచి ఉండటంతో అర్చకులు కంగుతిన్నారు. లోపలికి వెళ్లి చూడగా రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వరుసగా చేతివాటం..

శ్రీరంగనాయక స్వామి గుడిలో ఇంతకుముందూ దొంగలు (Theft) చేతివాటం చూపిన ఘటనలు ఉన్నాయి. వెండి ఆభరణాలు, ఉత్సవ విగ్రహం, గర్భగుడి తలుపులకు అమర్చిన వెండి తొడుగులు మాయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీరామానుజాచార్య స్వామి పంచలోహ విగ్రహం సైతం గతంలో చోరీకి గురైనట్లు సమాచారం. గుడి చుట్టుపక్కల ఉన్న మరో ఆలయంలోనూ గతంలో చోరీ జరిగిన ఘటన ఉందనీ పలువురు పేర్కొంటున్నారు.

భక్తుల్లో ఆందోళన.. భద్రత ఏమైంది?

ప్రసిద్ధ ఆలయంలో వరుసగా చోరీలు జరుగుతున్నా అధికారులు భద్రతపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట గుడి దగ్గర గస్తీ లేకపోవడం, నిఘా ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉండటంతో దొంగలకు పని ఈజీ అవుతోందని భక్తులు అంటున్నారు. కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రాత్రివేళ గస్తీ పెట్టాలని కోరుతున్నారు.

రంగనాయక స్వామి ఆలయాని(Ranganayaka Swamy Temple)కి దూరదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇలాంటి చోట వరుస చోరీలు జరగడం కలవరపెడుతోందని వారు అంటున్నారు. గుడిలోని విగ్రహాలు, ఆభరణాలకు పటిష్ఠ భద్రత కల్పించి, చోరీలకు పాల్పడుతున్న వారిని త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Also Read : ‘తరంగ్-2’ శిఖరంపై పెనుబల్లి యువకుడి జయకేతనం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>