కలం డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల డ్యామేజీ, అవకతవకలపై విచారణ జరిపించినట్లుగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru-Rangareddy Project) విషయంలోనూ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచడంతో పాటు వాటర్ సోర్స్ ను ఒక చోటి నుంచి మరో చోటికి మార్చడం, తెలంగాణ నీటి వాటాను తగ్గించడం, ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా మౌనంగా ఉండడం, తెలంగాణకు అన్యాయం జరగడం.. ఇలాంటి అన్ని విషయాల్లోనూ వాస్తవాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా జ్యుడిషియల్ కమిషన్‌ను నియమించాలనుకుంటున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సైతం ఒక ‘సిట్’ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
‘సిట్’తో వాస్తవాలు వెలుగులోకి :
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru-Rangareddy Project) బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయం, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్రూవల్ రావడం మొదలు ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభించకపోవడం, మూడు ఉమ్మడి జిల్లాలకు నీటి సరఫరా లేకపోవడం.. ఇలాంటి అంశాలను సీఎం ఏకరువు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే పాలమూరు ప్రాజెక్టుపై గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని, ఆ నిర్లక్ష్యానికి మూల్యాన్ని ప్రజలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. అవకతవకలు, అవినీతికి పాల్పడిన అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావును ఉరి తీసినా తప్పులేదని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆవేశంగా కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు జరిపేలా ఒక కమిటీ లేదా కమిషన్‌ను నియమించే అవకాశాలున్నాయి.
సిట్ ఏర్పాటు చేస్తే వాస్తవాలు చెప్తా : కవిత
ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి పాలమూరు ప్రాజెక్టుపై వాస్తవాలను తెలుసుకోవాలని భావిస్తే తాను స్వయంగా హాజరై వివరాలను వెల్లడిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లను ఖండిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తానన్నారు. ఇప్పటికే ‘సిట్’ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను 299 టీఎంసీలకు తగ్గిస్తూ ఒప్పందంపై సంతకం చేసి రాష్ట్ర నీటి హక్కులకు శాశ్వతంగా ద్రోహం చేసిన కేసీఆర్‌ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి బలం చేకూరే విధంగా కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం వాస్తవాలను వెలికి తీసేలా దర్యాప్తు జరపడంపై త్వరలో స్పష్టత రానున్నది.
వాటర్ సోర్స్ మార్పుపైనా వివాదం :
గత ప్రభుత్వం టేకప్ చేసిన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో పేరు మార్చి, వాటర్ సోర్స్ ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వాటర్ సోర్స్ ను కూడా జూరాల నుంచి శ్రీశైలానికి మార్చేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి దారితీసిన కారణాలను వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవైపు వైఎస్ జగన్‌తో కేసీఆర్ లాలూచీ పడ్డారని, తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడ్డారని, కమిషన్ల కోసం కాంట్రాక్టులు మంజూరు చేశారని, ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నిలిపేసి తెలంగాణ నీటి వాటా తగ్గేందుకు కుట్రకు పాల్పడ్డారని.. ఇలాంటి ఆరోపణలతో దర్యాప్తు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Read Also: ప్రశ్నించడమా?.. పారిపోవడమా?
Follow Us On : WhatsApp


