కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ఆందోళనలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ణానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి వారిని బలవంతంగా లాక్కెళ్లి, వ్యాన్లల్లో ఎక్కించి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ప్రస్తుతం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ చేపట్టి.. కోట్లాది మంది ఓట్లను జ్ణానేష్ కుమార్ తీసేస్తున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని.. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మాట వినకుండా.. ఏకపక్షంగా ఓట్ల తొలగింపు చేపట్టారని మండిపడ్డారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే ప్రతిపక్ష పార్టీల భేటీ..
జ్ణానేష్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి నుంచి తప్పించాలని దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇదే అంశంపై కీలక సమావేశం నిర్వహించబోతున్నాయి. అనంతరం ఆయన్ను అభిశంసన చేయాలంటూ స్పీకర్‌కు నోటీస్ ఇవ్వబోతున్నారు. ఇదే జరిగితే.. మూడోసారి ఆయన అభిశంసన ప్రక్రియ పార్లమెంట్ ముందుకు వెళ్లనుంది. అదే సమయంలో.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

