కలం వెబ్ డెస్క్ : కృష్ణా జలాల(Krishna Water)వినియోగం, వాటా పంపకాల విషయంలో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పాలకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్రంపై దూషణలు చేయడం అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ‘జాతీయ అబద్ధాల పోటీలు’ నిర్వహిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే మొదటి రెండు అవార్డులు దక్కుతాయని కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సింది పోయి ప్రజలను గందరగోళంలోకి నెట్టి స్వార్థ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పవిత్రమైన అసెంబ్లీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కృష్ణా జలాల విషయంలో మొదట తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే అన్యాయం చేసిందని బండి ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం, బచావత్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులను కొత్త ట్రైబ్యునల్ పరిశీలించరాదని సెక్షన్ 89ను చేర్చిందన్నారు. దీని వల్ల కొత్త ట్రైబ్యునల్‌కు పాత కేటాయింపులపై సమీక్ష చేసే అవకాశం లేకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు 2023 అక్టోబర్ 6న మోడీ ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీంతో కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజించే అవకాశం ఏర్పడిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక, న్యాయ వాదనలు బలంగా వినిపించడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
నాటి కేసీఆర్ ప్రభుత్వం కూడా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిందని బండి ఆరోపించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా, 299 టీఎంసీలు సరిపోతాయని 2015 జూన్ 19న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నా కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఈ అంశంపై 2020 మే 12న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లు బండి గుర్తు చేశారు. కేంద్రమంత్రి స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా పనులు ఆపాలని కృష్ణా బోర్డును కోరినట్లు చెప్పారు. బోర్డు ఐదు సార్లు ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసినా కేసీఆర్ మాత్రం ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినా కేసీఆర్ హాజరుకాక వాయిదా కోరారని చెప్పారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటును కూడా సుప్రీంకోర్టు కేసుల పేరుతో దాదాపు ఎనిమిదేళ్లు ఆలస్యం చేశారని మండిపడ్డారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అవగాహనారాహిత్యానికి నిదర్శనమని బండి వ్యాఖ్యానించారు. పోలవరం ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డికి వినియోగించుకోవాలని కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. కానీ, 90 టీఎంసీల నీటి వినియోగంపై సమగ్ర వివరాలు పంపకపోవడంతోనే డీపీఆర్ తిరిగి పంపబడింది, ఇది తిరస్కరణ కాదని చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే నిర్లక్ష్యం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన తప్పిదాలను ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దూషణలతో కాలయాపన చేయకుండా తప్పులను సరిదిద్దుకొని తెలంగాణ హక్కులను కాపాడాలని సూచించారు. ఈ విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.


