కలం, వెబ్ డెస్క్: అరెస్టు చేసే సమయంలో సంబంధిత వ్యక్తికి అర్థమయ్యే భాషలో దానికి గల కారణాలను రాతపూర్వకంగా అందించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. రాతపూర్వక కారణాలు తెలపకుండా చేసే ఏ అరెస్టైనా అక్రమమేనని, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం అరెస్టు కారణాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం తెలిపింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, ఆ ప్రాథమిక అరెస్టును అక్రమమైనదిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో విడుదలైన వ్యక్తిని తిరిగి అరెస్ట్ చేయాలంటే పోలీసులకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని, సరైన రాతపూర్వక కారణాలతో మేజిస్ట్రేట్ అనుమతి కోరాల్సిందేనని పేర్కొంది.
తొలిసారి అరెస్ట్ చేసే సమయంలో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిన పోలీస్ అధికారికి ఆ కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను అప్పగించకూడదని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, నిబంధనలు పాటించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి సర్వీస్ రికార్డుల్లో కూడా ప్రతికూల అంశాలుగా నమోదు చేయాలని ఆదేశించింది. పంజాబ్‌కు చెందిన జస్కరణ్జిత్ సింగ్ అక్రమ అరెస్టు కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

