కలం, హనుమకొండ: వరంగల్ అభివృద్ధికి తాను తీసుకొచ్చిన నిధుల కంటే బీఆర్ఎస్ (BRS) నేతలు ఒక్కపైసా ఎక్కువ తెచ్చినట్టు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) సవాల్ విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూకేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్ కుటుంబం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మరోసారి బండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వరంగల్‌కు వస్తే కాంగ్రెస్ తడాఖా చూపిస్తానన్నారు.
ఇక కేటీఆర్ ఫాంహౌస్ భూములన్నీ బోగస్ అని నాయిని ఆరోపించారు. కేసీఆర్ ఒక పాస్ పోర్ట్ బ్రోకర్ అని అన్నారు. పదేళ్ల పరిపాలనలో దోచుకున్న ఆస్తులన్నీ పోతాయని బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. వరంగల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం కూడా 22Aలోనే ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వైట్ కాలర్ దోపిడీదారులు అని విమర్శించారు.

