మరోసారి తిరుమల మెట్ల మార్గంలో చిరుత పులి కలకలం

కలం, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala) మరోసారి చిరుతపులి సంచారం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ఈరోజు ఉదయం అలిపిరి నడకమార్గంలోని సుమారు 2,800వ మెట్టు వద్ద చిరుత కనిపించినట్లు సమాచారం. ఏడో మైలు ప్రాంతం నుంచి శ్రీ నరసింహస్వామి ఆలయ పరిసరాల వరకు చిరుత సంచరించినట్లు భక్తులు గుర్తించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న భక్తులు అప్రమత్తమయ్యారు.

అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నడకమార్గంలో చిరుత (Leopard) కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరు అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్లగా, మరికొందరు సిబ్బంది సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలినట్లు తెలుస్తోంది.

భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తం

తిరుమల అడవుల్లో చిరుతల సంచారం సాధారణమే అయినప్పటికీ, నడకమార్గంలో భక్తులకు సమీపంగా వాటి కదలికలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారం నేపథ్యంలో అలిపిరి మార్గంలో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.

మరోవైపు అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా, సిబ్బంది సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చిరుత లేదా ఇతర వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటి దగ్గరకు వెళ్లకుండా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. భక్తుల రాకపోకల నేపథ్యంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>