కలం, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir), చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. శ్రీనగర్, ఓల్డ్ సిటీ లాల్ చౌక్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ (JKP), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్త బృందాలు కీలక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వావాహనాలను తనిఖీలు చేస్తున్నాయి.
ఈ సీజన్లో తొలిసారిగా భారీ మంచు కురిసింది. దీంతో కాశ్మీర్లో పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా గుల్మార్గ్, పహల్గామ్, సోనామార్గ్‌లో 100 శాతం హోటళ్లలో ఆక్యుపెన్సీ ఏర్పడింది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలకు దారితీసే అవకాశం ఉండటంతో నివారించడానికి అదనపు బలగాలు మోహరించాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉగ్రవాదుల (Terrorist) కోసం విస్తృత ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. పూంచ్ జిల్లాలోని లోరాన్ గారంగ్ అడవిలో ఒక ఉగ్రవాద స్థావరాన్ని భద్రత బలగాలు ఛేదించాయి. ఐఈడీల తయారీకి ఉపయోగించే సామాగ్రిని, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనతో భద్రతా దళాలు మరింత అలర్ట్ అయ్యాయి.


