కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని గజల్దోబా (Gajoldoba) ప్రాంతంలో మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. తీస్తా నదిలోని ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోయిన మూడు, నాలుగు రోజుల వయసున్న ఏనుగు పిల్లను స్థానిక మత్స్యకారులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి రక్షించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది సహకారంతో దానిని తల్లి ఏనుగు వద్దకు సురక్షితంగా చేర్చారు. నదిని దాటే క్రమంలో తల్లి ఏనుగు నుంచి పిల్ల విడిపోయినట్లు తెలుస్తోంది. తీస్తా బ్యారేజీ (Teesta River) ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహంలో కొట్టుకుపోతున్న గజశిశువు నీటిలో నిస్సహాయంగా కొట్టుమిట్టాడుతుండగా మత్స్యకారులు గమనించారు.
ప్రాణాలకు తెగించి మత్స్యకారుల రక్షణ
పరిస్థితిని గమనించిన అజయ్ దాస్, రాజేష్ దాస్, గోపాల్ దాస్, మిట్టు దాస్, బిశ్వనాథ్ దాస్ వెంటనే రంగంలోకి దిగారు. నదిలోని బలమైన ప్రవాహాన్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లి ఏనుగు పిల్లను(Elephant Calf) నీటి నుంచి బయటకు తీశారు. అనంతరం దానిని నదిలోని ఓ ద్వీప ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా ఉంచారు. సమాచారం అందుకున్న బైకుంఠపూర్ అటవీ విభాగం సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. తల్లి ఏనుగు ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు ప్రారంభించారు.
తల్లి చెంతకు చేరిన గజశిశువు
రక్షించినప్పటి నుంచి ఏనుగు పిల్ల తన తల్లి కోసం పదేపదే అరుస్తుండటంతో అటవీ సిబ్బంది, మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. దాదాపు రెండు గంటల ఉత్కంఠభరిత ప్రయత్నాల అనంతరం గజల్దోబా వద్ద తీస్తా నది(Teesta River)లోని ద్వీప ప్రాంతంలో తల్లి ఏనుగును గుర్తించారు. ఆ తర్వాత పిల్లను జాగ్రత్తగా తల్లి వద్దకు చేర్చడంతో తల్లి, పిల్ల తిరిగి కలిశాయి. ప్రమాదకర పరిస్థితుల్లో మత్స్యకారులు చూపిన ధైర్యం, అటవీ సిబ్బంది సమన్వయంతో సాగిన రక్షణ చర్యలను స్థానికులు ప్రశంసించారు. వన్యప్రాణుల పట్ల మానవత్వం, కరుణకు ఈ ఘటన ఓ హృద్యమైన ఉదాహరణగా నిలిచింది.
Fishermen risked their lives to rescue a 3–4-day-old elephant calf swept away in the Teesta River. 🐘❤️
After nearly two hours of effort, they safely reunited the calf with its mother. 🙏తీస్తా నదిలో కొట్టుకుపోయిన మూడు, నాలుగు రోజుల ఏనుగు పిల్లను ప్రాణాలకు తెగించి మత్స్యకారులు… pic.twitter.com/bkM2pkOJy0
— Kalam Daily (@kalamtelugu) September 22, 2026
Also Read : విద్యార్థులతో కలిసి సీఎం విజయ్ టిఫిన్.. తమిళనాడులో విప్లవాత్మక నిర్ణయం!
Follow Us On : WhatsApp

