కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జోగినపల్లి సంతోష్ రావు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించాడని కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యా రావు (Kalvakuntla Ramya Rao) ఆరోపించారు. ఒకప్పుడు వేసుకోవడానికి మంచి దుస్తులు, చెప్పులు కూడా లేని వ్యక్తి.. ఈ రోజు రూ.వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారని ప్రశ్నించారు. కరీంనగర్‌లో సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఉండే ఆయన కుటుంబానికి.. విలాసవంతమైన విల్లాలు, ఫాం హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.
స్కూటర్ కూడా కొనుక్కోలేని స్థితి నుంచి ఖరీదైన కార్లు కొనే స్థాయి ఎలా వచ్చిందని రమ్యా రావు ప్రశ్నించారు. నానక్ రామ్ గూడలో సంతోష్ రావు భార్య పేరిట రూ.21.45 కోట్ల విలువైన 21 వేల చదరపు అడుగులు ఇల్లు ఉందని.. ఈ స్థాయిలో డబ్బులు ఎలా చెల్లించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే సంతోష్ రావు ఆస్తులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఫాం హౌస్.. ఖరీదైన ప్లాట్లు
జోగినపల్లి సంతోష్ రావు (Joginipally Santhosh Rao) ఇంట్లో కుటుంబ సభ్యులకే తెలియకుండా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నాడని రమ్యా రావు (Kalvakuntla Ramya Rao) ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చిన్న షాపూర్‌లోని విలాసవంతమైన ఫాం హౌస్ ఉందని.. కానీ, ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం చూపించలేదన్నారు. కొండాపూర్ ప్రాంతంలో సంతోష్ రావుకు రూ.40 కోట్ల విలువైన విల్లాలు, బంజారాహిల్స్‌లో ఖరీదైన ప్లాట్లు, పలు కంపెనీల్లో షేర్లు.. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ఆస్తులు పోగేసుకున్నాడని విమర్శించారు. వెన్నమనేని శ్రీనివాస రావు అనే వ్యక్తి సంతోష్ రావుకు బినామీ అని, తెలంగాణలో బయటపడిన ఆస్తులు సంతోష్ రావు దోపిడీలో పది శాతం మాత్రమే అన్నారు. దీనిపై కేటీఆర్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.
Also Read : హిమాంశు సిల్వర్.. రుద్రాంక్ష్ బ్రాంజ్!
Follow Us On: X(Twitter)

