కేర‌ళ‌లో విరిగిప‌డ్డ కొండచ‌రియ‌లు.. ఐదుగురు మృతి

క‌లం, వెబ్‌డెస్క్: కేరళ (Kerala)లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభ‌త్సం సృష్టించాయి. ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల‌తో కొండచరియలు (Landslides) విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు వ‌ర‌ద నీటిలో గల్లంతయ్యారు. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇడుక్కి (Idukki) జిల్లా మున్నార్ సమీపంలోని ఒక వెల్లుల్లి తోటలో ఏర్పాటు చేసిన షెడ్‌లో కొంద‌రు త‌ల‌దాచుకున్నారు. అక్క‌డ అక‌స్మాత్తుగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో బాలకృష్ణన్, ఆయన సోదరి చిన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణన్ భార్య మరియమ్మ మున్నార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు బాధితుల‌ను వెదురు స్ట్రెచర్లపై మోసుకొచ్చారు.

మరొక ఘటనలో మలప్పురం (Malappuram) జిల్లా టికె కాలనీ వద్ద కొట్టప్పుళ నదిలో ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో నలుగురు న‌దిలో కొట్టుకుపోయారు. మృతులను తిరూర్ నివాసి మహమ్మద్ కుట్టి, ఎడరికోడ్ నివాసి అనాస్‌లుగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన రఫీక్, సజ్జాద్, రహీమ్, సజితల కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగానే నదిలో వరద మట్టం పెరిగిందని రెవెన్యూ మంత్రి అనిల్ కుమార్ వెల్ల‌డించారు. అన్ని ప్రాంతాల్లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని, లోత‌ట్టు ప్రాంతాలు, అసుర‌క్షిత ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తున్నార‌ని వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>