కలం డెస్క్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కా (Maoist Barse Deva) పోలీసులకు లొంగిపోయారు. ఇప్పటికే తెలంగాణ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కానీ అధికారికంగా రాష్ట్ర పోలీసు వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సరెండర్ కావాలనే అంశంలో సుదీర్ఘంగా ఆలోచించిన అనంతరం కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా రాయబారం నడిపి లొంగిపోయినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పోలీసుల నుంచి ప్రకటన వెలువడే అవకాశమున్నది. హిడ్మా ఎన్కౌంటర్కంటే ముందే ఆయన లొంగిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు సూత్రప్రాయంగా తెలిపాయి. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం ఆ ప్రక్రియ వేగవంతమైందని తెలిపాయి. ఆయనపై రూ. 50 లక్షల రివార్డు ఉన్నది.
1వ బెటాలియన్ కమాండెంట్ :
నాలుగు రాష్ట్రాల పోలీసులతో మీడియేటర్ల ద్వారా టచ్‌లోకి వెళ్ళి చివరకు తెలంగాణలో లొంగిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవా ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మాతో కలిసి ఒకటిన్నర దశాబ్దం పాటు కలిసి పనిచేశారు. పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) 1వ నెంబర్ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న హిడ్మా పదోన్నతిపై కేంద్ర కమిటీలోకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలను బర్సె దేవాకు పార్టీ అప్పగించింది. ఆ తర్వాత స్టేట్ మిలిటరీ కమిషన్ బాధ్యతలనూ చూసుకున్నారు. దర్భా డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి నుంచి 1వ బెటాలియన్ కమాండెంట్ స్థాయికి ఎదిగిన బర్సె దేవా అనేక కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు చనిపోయిన అనేక ఆంబుష్లలో దేవా ప్రమేయం ఉన్నట్లు చత్తీస్‌గఢ్ పోలీసులు పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్తో పార్టీలో అలజడి :
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) ప్రారంభించిన తర్వాత వరుస ఎన్కౌంటర్లు, నాయకత్వం చనిపోవడం, లొంగుబాట్లు, ఆయుధాల అప్పగింత తదితర చర్యలతో క్షేత్రస్థాయిలోని డివిజనల్ కమిటీలు, దళాలు గందరగోళంలో పడ్డాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దళ కమాండర్ మొదలు పార్టీ ఏరియా కమిటీ సభ్యులు, దళ సభ్యులు, మిలీషియా కన్ఫ్యూజర్లో పడ్డారని, లొంగిపోవడమే శ్రేయస్కరమనే ఆలోచనకు వచ్చినట్లు చత్తీస్‌గఢ్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు బర్సె దేవా (Maoist Barse Deva) సైతం లొంగిపోయినట్లు తెలిసింది. పౌరహక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు దీనిపై స్పందిస్తూ, తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్న బర్సె దేవాను వెంటనే కోర్టులో హాజరపర్చాలని పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఆయనతో పాటు మరో 15 మంది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు వీరిని పట్టుకున్నట్లు గుర్తుచేశారు.
Read Also: వహ్వా.. వందే భారత్ స్లీపర్.. విశేషాలివే
Follow Us On: Pinterest


