కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League)లో వేదికగా నిలవనున్న స్టేడియంల జాబితా నుంచి చట్ట గ్రామ్‌ను తొలగించింది. టోర్నీ సస్పెన్షన్ వల్ల తలెత్తిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది బీసీబీ. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) 2025–26 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు చిట్టగాంగ్‌ను వేదికగా తొలగిస్తున్నట్లు బీపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
ఈ వారం ఆరంభంలో టోర్నమెంట్ రెండు రోజుల పాటు నిలిచిపోవడంతో ఏర్పడిన షెడ్యూల్ అంతరాయాలే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. మాజీ బంగ్లాదేశ్ ప్రధాని ఖలేదా జియా మృతితో బీపీఎల్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. దీంతో నిర్వాహకులు టోర్నమెంట్ షెడ్యూల్‌ను తిరిగి సవరించాల్సి వచ్చింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 12 వరకు సిల్హెట్‌లో మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్ రోజుల పాటు ఢాకాలో మ్యాచ్‌లు నిర్వహించి, అనంతరం జనవరి 23న ప్లే ఆఫ్స్, ఫైనల్‌ను నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం వెనుక లాజిస్టిక్ పరిమితులు, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టు సిద్ధతకు భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశం ఉందని బీపీఎల్ సభ్య కార్యదర్శి ఇఫ్తేఖార్ రహ్మాన్ తెలిపారు.
“షెడ్యూల్‌లో ఎలాంటి ఖాళీలు సృష్టించే అవకాశం లేదు. సిల్హెట్ నుంచి చిట్టగాంగ్‌కు మారాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. ముఖ్యంగా ప్రసార పరికరాల తరలింపు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ వారం రెండు మ్యాచ్ రోజులు కోల్పోయిన తర్వాత ఆ మార్పు సాధ్యం కాలేదు” అని ఇఫ్తేఖార్ చెప్పారు.
వేదికల కేటాయింపుల్లో త్యాగం తప్పదు
ఫైనల్ తేదీని మార్చకపోవడమే కీలక అంశమని ఆయన స్పష్టం చేశారు. “జాతీయ జట్టు ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు సమయం అవసరం. అందుకే ఫైనల్‌ను ఒక్కరోజైనా వాయిదా వేయలేకపోయాం. దురదృష్టవశాత్తు, మిగిలిన షెడ్యూల్ నుంచి చిట్టగాంగ్‌ను తొలగించాల్సి వచ్చింది” అని తెలిపారు. చిట్టగాంగ్ అభిమానుల నిరాశను అర్థం చేసుకుంటున్నామని ఇఫ్తేఖార్ పేర్కొన్నారు. అయితే వేదికల కేటాయింపుల్లో కొన్ని త్యాగాలు తప్పవని అన్నారు.
Read Also: మరో వరల్డ్ రికార్డ్‌కు చేరువలో బాబర్ ఆజమ్
Follow Us On : WhatsApp


