epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారీగా పెరగనున్న సిగరెట్ ధరలు: ఒక్కటి రూ.72?

కలం, వెబ్​ డెస్క్​ : పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరనున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సగటున 15 రూపాయల నుండి 20 రూపాయల మధ్య లభిస్తున్న ఒక్కో సిగరెట్ (Cigarette) ధర, కొత్త పన్నుల విధింపు తర్వాత ఏకంగా 72 రూపాయలకు చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 31, 2025న జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, పొగాకు ఉత్పత్తులపై పన్నుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. కొత్త నిబంధనల ప్రకారం సిగరెట్లు, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనున్నారు. బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. కేవలం జీఎస్టీ మాత్రమే కాకుండా, సిగరెట్ల పొడవును బట్టి ప్రతి వెయ్యి స్టిక్స్‌పై 2,050 రూపాయల నుండి 8,500 రూపాయల వరకు అదనపు ఎక్సైజ్ డ్యూటీని కూడా వసూలు చేయనున్నారు.

సాధారణంగా తక్కువ ధర కలిగిన బ్రాండ్లపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 40 శాతం జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్, రిటైలర్ల మార్జిన్, ఇతర ఛార్జీలన్నీ కలిపితే ఒక్కో సిగరెట్ ధర 70 నుండి 72 రూపాయల వరకు చేరవచ్చని ది వీక్, ట్రేడ్ బ్రెయిన్స్ వంటి ఆర్థిక విశ్లేషక సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం 20 సిగరెట్లు(Cigarette) ఉండే ఒక ప్యాకెట్ ధర ఏకంగా 1,400 రూపాయలు దాటే ప్రమాదం ఉంది. అయితే ప్రీమియం బ్రాండ్ల విషయంలో ఈ ధరల పెంపు శాతం కొంత తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.

పాన్ మసాలా వినియోగదారుల పైన కూడా ప్రభుత్వం పన్ను భారాన్ని మోపింది. వీటిపై జీఎస్టీతో పాటు అదనంగా ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ముగియనుండటంతో, ఆ ఆదాయ లోటును భర్తీ చేస్తూనే ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం, సిగరెట్ విక్రయ ధరలో కనీసం 75 శాతం పన్నుల రూపంలో ఉండాలి. ప్రస్తుతం భారతదేశంలో ఈ పన్నుల శాతం 53 శాతంగానే ఉంది. తాజా పెంపుతో భారత్ ఆ లక్ష్యానికి చేరువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>