కలం, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్ (Switzerland)లోని ఆల్పైన్ స్కీ రిసార్ట్ టౌన్ క్రాన్స్-మోంటానాలో నూతన సంవత్సర వేడుకల సమయంలో ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. స్థానిక సమయం అర్ధరాత్రి 1:30 గంటలకు కాన్‌స్టెలేషన్ బార్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది. అప్పటికి బార్‌లో నూతన సంవత్సర వేడుకలు జోరుగా సాగుతున్నాయి. పేలుడు ధాటికి బార్ ధ్వంసమైందని, లోపల ఉన్నవారు భయంతో పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
స్విట్జర్లాండ్ (Switzerland) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎంతమంది మరణించారు అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడు కారణాలు ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీక్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు దీనికి కారణమా అని అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


