కలం డెస్క్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై (Irrigation Projects) అన్ని వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో జనవరి 2న చర్చ జరిగేలా షెడ్యూలు ఖరారు కావడంతో సమైక్య రాష్ట్రంలో జారీ అయిన ఉత్తర్వులతో పాటు గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కూడా ఆ పీపీటీలో ప్రదర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 39 స్లైడ్ల ద్వారా పీపీటీ డ్రాఫ్ట్ కాపీ సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో జరిగిన చర్చ, ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వాటిపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. ఇలాంటివన్నీ వివరించనున్నట్లు ఇరిగేషన్ వర్గాల సమాచారం.
పాలమూరుకు 90 టీఎంసీలకు తగ్గం :
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న 90 టీఎంసీల విధానానికే కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) ఇప్పటికే పలు మీడియా సమావేశాల్లో స్పష్టం చేశారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా వాడుకునే 45 టీఎంసీలతో పాటు ఏపీ ప్రభుత్వం పోలవరం నుంచి కృష్ణా బేసిన్ (ప్రకాశం బ్యారేజీకి)కి తరలించే నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలను వినియోగించుకుంటామనే అంశాన్ని నొక్కిచెప్పనున్నారు. కేవలం 45 టీఎంసీలకే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం అబద్ధమనే అంశాన్ని ఆధారాలతో సహా వివరించనున్నారు. ఈ ఆధారాలు కూడా స్లైడ్ల రూపంలో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఇచ్చిన జీవోనే ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్న విషయాన్ని వెల్లడించనున్నారు.
బీఆర్ఎస్ నేతల విష ప్రచారం :
కేంద్రానికి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్న 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించిన వాటా మాత్రమేనని, పోలవరం నుంచి తరలించిన గోదావరి జలాలకు సంబంధించిన 45 టీఎంసీలను వదులుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదనే అంశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు. గోదావరి నీటి తరలింపు ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి అంశం ప్రస్తుతం జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ‘సబ్‌జ్యుడిస్ మేటర్’గా ఉన్నందున దాని ప్రస్తావన చేయలేదనే విషయాన్ని కూడా వివరించనున్నారు. కేవలం 45 టీఎంసీలకే కాంగ్రెస్ రాజీ పడిందని, ఏపీ ప్రభుత్వానికి వంతపాడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నదన్న బీఆర్ఎస్ నేతల ప్రచారం పచ్చి అబద్ధాలనేది నొక్కి చెప్పాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలను వక్రీకరించే తీరులో బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదనే ఆరోపణలు చేయనున్నారు.
బీఆర్ఎస్ పీపీటీ కూడా ఉంటుందా? :
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పీపీటీ ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చినట్లుగానే తమకు కూడా ఇవ్వాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారా?.. లేక నెగెటివ్ సమాధానాన్ని ఇస్తారా అనేది సస్పెన్స్. పీపీటీ ప్రదర్శించేందుకు చాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులంతా మూకుమ్మడిగా స్పీకర్‌పై శుక్రవారం సెషన్లో ఒత్తిడి చేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కావడంతో అధికార, ప్రతిపక్ష సభ్యులకు సమానావకాశాలు ఉండాలని డిమాండ్ చేయనున్నారు. పీపీటీ ప్రదర్శనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ కుట్రలను కూడా తాము బహిర్గతం చేస్తామని హరీశ్‌రావు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. పీపీటీ కోసం ఇప్పటికే తగిన వివరాలతో బీఆర్ఎస్ స్లైడ్లు తయారుచేసే పని ముమ్మరంగా జరుగుతున్నది.
Read Also: వీధి కుక్కలకు ‘నో ఎంట్రీ’
Follow Us On: Instagram


