కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా అంత్యక్రియలు (Khaleda Zia Funeral) ముగిశాయి. రాజధాని ఢాకాలోని జియా ఉద్యాన్‌లో భర్త జియావుర్ రహ్మాన్ సమాధి పక్కనే జియా పార్థివదేహాన్ని బుధవారం ఖననం చేశారు. వేలాది ప్రజలు హాజరై అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంతకుముందు పార్లమెంట్ భవనం సమీపంలో ఉన్న మానిక్ మియా ఎవెన్యూలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్, బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్‌తో పాటు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల ప్రతినిధులు హాజరయ్యారు.
అంతకుముందు జియా మృతికి సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ అందించిన సందేశ లేఖను ఆమె కుమారుడు తారిఖ్ రెహ్మాన్‌కు జై శంకర్ అందజేశారు. జియా మృతికి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా అవనతం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10వేల మంది సైనికులు, పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసింది.

Read Also: పుతిన్ ఇంటిపై దాడి.. వీడియో విడుదల
Follow Us On: Instagram


