అమెరికాలోనూ ఉచిత హామీలు.. ఓటేస్తే ప్రతీ పౌరుడికి 5 వేల డాలర్లు

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. వచ్చే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతి అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్ల చొప్పున డివిడెండ్ అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ ఈ హామీ ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ బ్యాలెట్‌పై తన పేరు ఉన్నట్లుగా భావించి రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన మద్దతుదారులను కోరారు.

‘రిపబ్లికన్లను గెలిపిస్తే మీకూ లాభమే’

రిపబ్లికన్ పార్టీకి (Republican Party) ఓటు వేసి విజయం సాధించేలా చేయాలని ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ గెలిచినట్లే. మీకు 5 వేల డాలర్లు వస్తాయి అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య దాదాపు 24.5 కోట్లుగా ఉండటంతో ప్రతిఒక్కరికీ 5 వేల డాలర్లు చెల్లిస్తే సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ ప్రతిపాదన అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

నిధులు ఎక్కడి నుంచి? అమలుపై సందేహాలు

ఇంత భారీ మొత్తాన్ని ఏ విధంగా సమకూర్చుతారనే అంశంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకానికి కనీసం 1 ట్రిలియన్ డాలర్లు అవసరమయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే నిధుల సమీకరణపై ప్రశ్నలకు సమాధానంగా అమెరికా చాలా డబ్బు సంపాదిస్తోంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు పంపిణీని ఆర్థికంగా, రాజకీయంగా అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్‌కు తగ్గుతున్న ఆదరణ.. డెమొక్రాట్లకు ఆధిక్య అంచనాలు

మరోవైపు అమెరికాలో ట్రంప్ పాలనపై అసంతృప్తి పెరుగుతున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. ఆయన ప్రజాదరణ సుమారు 30 శాతం స్థాయిలోనే ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ధరల పెరుగుదలతో పాటు ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధంపై కూడా ఓటర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో 230-205 సీట్లతో, సెనేట్‌లో 51-49 ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని ‘డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ’ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ప్రకటించిన 5 వేల డాలర్ల డివిడెండ్ హామీ రిపబ్లికన్లకు ఎంతవరకు రాజకీయంగా కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>