కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా భూత్పూర్ సమీపంలోని కేబీఎన్ ఫంక్షన్ హాల్ వద్ద జాతీయ రహదారి-44 (Bhuthpur Highway) పై గురువారం తెల్లవారుజామున UP 77 BN 7458 నంబర్ గల మేకలు, గొర్రెల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న ప్రభావంతో సూచిక బోర్డు రహదారికి అడ్డంగా పడిపోగా, వాహనం ఇంధన ట్యాంక్ దెబ్బతినడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వాహనం క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు ఉండగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో స్థానిక భూత్పూర్ పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు.
మేకలతో ఉన్న వాహనం లోపల మరో వ్యక్తి ఉండగా, మేకలన్నీ ఒక్కసారిగా అతనిపై పడిపోవడంతో బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మేకలు మృతి చెందాయి.
సమాచారం అందుకున్న వెంటనే భూత్పూర్ పోలీసులు, స్థానిక పోలీసులు ,అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రహదారికి అడ్డంగా పడిన సూచిక బోర్డును పోలీసులు వెంటనే తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి జాతీయ రహదారి-44 పై వాహనాల రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించారు.
ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డి.జానకి ఘటనాస్థలిని పరిశీలించి, ప్రమాద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, భూత్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ నాగన్న, మూసాపేట సబ్ ఇన్స్పెక్టర్ వేణు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఉన్నారు.

