కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ యూట్యూబర్ నందనను (YouTuber Nandana)శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో విమానాశ్రయంలో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నందన, ఆమె భర్త కలిసి లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నప్పటికీ హామీ మేరకు ఉద్యోగాలు కల్పించలేదని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా నందనపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్లకుండా నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం. సోమవారం నందన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె వివరాలను పరిశీలించారు. లుకౌట్ నోటీసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కేసు దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
నందన, ఆమె భర్తపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగాల పేరుతో ఎంతమంది నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారిస్తున్నారు.

