కలం, జగిత్యాల : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల (Jagtial) నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన (BRS Protest) కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు కలెక్టరేట్ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు మెరుపు సమ్మె నిర్వహించారు. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేసి అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, వృద్ధులకు రూ.4,000, బీడీ కార్మికులకు పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ఆలోచన మేరకు, కేటీఆర్ దిశానిర్దేశంతో ఐదు రోజులుగా హామీల అమలుపై నిరసనలు చేపడుతున్నామని తెలిపారు.
జగిత్యాలలో ప్రభుత్వ ఆస్తుల విషయంలోనూ వివక్ష, నిర్లక్ష్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారంలో సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు అప్పగించారని, 20 గుంటల స్థలంలో 4 గుంటల్లో మాత్రమే బంక్ ఏర్పాటు చేసి మిగిలిన భూమిపై ఆక్రమణ జరిగిందని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి 10 నెలలు గడిచినా చర్యలు తీసుకోలేదన్నారు. కొత్త బస్‌స్టాండ్‌లో పెట్రోల్ బంక్ పేరుతో మరో రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఆక్రమణకు గురవుతోందని ఆరోపించిన జీవన్ రెడ్డి, చల్గల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని పక్కన పెట్టి మరోచోట ఏర్పాటు చేయడంపై ప్రశ్నించారు. తిమ్మాపూర్ ముప్పరపు చెరువు కబ్జా అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని అన్నారు. నల్ల ట్రీట్ డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్‌ను శాసనసభలో ఎదుర్కొనే ధైర్యం లేకే ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావా వసంత మాట్లాడుతూ.. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్న హామీలు తక్షణమే అమలు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేసి కలెక్టర్ భవనాలు నిర్మాణం చేపట్టారు. జాబ్ గ్యారంటీ హమీ జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారింది. జిల్లాల్లో గుట్టలు, సహజ వనరులు కనుమరుగు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

