భద్రాచలంలో పుష్కర కళ.. భక్తుల బస కోసం డార్మెటరీ భవన్..!

​కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) కళ ముందే సంతరించుకుంది. వచ్చే ఏడాది 2027 జూన్ – జులై నెలల్లో అత్యంత వైభవంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు వసతి కొరత లేకుండా రూ. 1.50 కోట్ల వ్యయంతో భారీ “జీ+1 డార్మెటరీ భవన్” నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం భద్రాచలంలోని ‘అమ్మ సత్రం’ ప్రాంతంలో దేవాదాయ-ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణ పనులకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి, పవిత్ర గోదావరి పుష్కర స్నానాలకు విచ్చేసే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ తరఫున నిధులు మంజూరు చేసి డార్మెటరీ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. పుష్కర పనుల పురోగతిపై ప్రతి 10 రోజులకు ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, పనుల్లో ఆలస్యం వహించకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా, పుష్కర ఘాట్ల నిర్మాణ బాధ్యతలను ఇరిగేషన్ శాఖ, మంచినీటి సరఫరాను ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ, రహదారుల అభివృద్ధి పనులను ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

​అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పుష్కర పనులు కొనసాగుతున్నాయన్నారు. భద్రాచలంలో ప్రారంభించిన ఘాట్లు, డార్మెటరీ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఈఓ దామోదర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>