కలం, నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా అచ్చంపేట పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (MLA Vamshi Krishna) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో చేసిందన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలను అమలు చేసిందని తెలిపారు. అంతేగాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు.
రైతులకు అండగా..
రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బాకీ కార్డులు పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా.. ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని.. ఇటీవల అచ్చంపేటలో ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమమే నిదర్శనం అన్నారు.

