కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 14 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ రూపంలో రూ.10 వేల కోట్లు బాకీ ఉందన్నారు. విద్యార్థులు ఫీజు కట్టి సర్టిఫికెట్ తీసుకెళ్లాలని కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్డుపై పడేశారని, వారిని ఇంజినీరింగ్ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నానరు. వెంటనే జీవో నెం.97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూపులు..
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నా, ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గమని అన్నారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని ఇవ్వలేదని, ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి అమలు చేయడం లేదన్నారు. తులం బంగారం పేరిట మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు. తమ హయాంలో అమర్ రాజా కంపెనీ తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
ఈ నిరసనలో పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, ముడా మాజీ ఛైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ ఛైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి, కట్ట రవికిషన్, కిషోర్ కుమార్, నవకాంత్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం, గిరిధర్ రెడ్డి, అనంత రెడ్డి, విద్యార్థి నాయకులు శివకుమార్, సుదీప్ రెడ్డి, నవీన్ రాజు, గణేష్, సత్యపాల్, మనీష్, అఖిల్, ప్రమోద్, రాకేష్, నీరాజ్, సాయి పాల్గొన్నారు.

