కలం, వెబ్ డెస్క్ : ఎస్ఐఆర్(SIR) ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ ఒక పెద్ద కుంభకోణం అని.. తుది ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఉపయోగించి ఎస్ఐఆర్ నిర్వహించడం పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. బెంగాల్ లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితా నుండి ఒక్క అర్హుడి పేరు తొలగించినా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
మంగళవారం బంకురా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ పాల్గొని ప్రసంగించారు. ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర ప్రజలను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా సుమారు 60 మంది మరణించారని.. వృద్దులను కూడా విచారణకు పిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రానివ్వరని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై జరుగుతున్న దాడులను ఆమె ఖండించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బంగారు బంగ్లాదేశ్ నిర్మిస్తామని చెబుతున్న బీజేపీ.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను కొడుతున్నారని సీఎం మమతా (Mamata Banerjee) విమర్శించారు.
కాగా, బెంగాల్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత డిసెంబర్ 16 న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 58 లక్షలకు పైగా ఓట్లను ఈసీ(EC) తొలగించింది. మొత్తం 7.6 కోట్ల ఓటర్లలో సుమారు 1.66 కోట్ల మంది ఓట్లపై ఎన్నికల సంఘం అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి పత్రాలను ధృవీకరించడానికి ఈసీ అధికారులు విచారణకు పిలిచారు.
Read Also: ఆ కంటెంట్ తీసేయండి.. సోషల్ మీడియా యాప్ లకు కేంద్రం వార్నింగ్
Follow Us On: Youtube


